13 ఏళ్లుగా కోమాలో యువకుడు.. కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి హరీష్ రాణా కేసులో చరిత్రాత్మక తీర్పు.. లైఫ్ సపోర్ట్ నిలిపివేయడానికి గ్రీన్ సిగ్నల్
13 ఏళ్లుగా కోమాలో యువకుడు.. కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి
హరీష్ రాణా కేసులో చరిత్రాత్మక తీర్పు.. లైఫ్ సపోర్ట్ నిలిపివేయడానికి గ్రీన్ సిగ్నల్
దాదాపు 13 ఏళ్లుగా కోమాలో జీవచ్ఛవంలా ఉన్న యువకుడి కేసులో భారత సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఢిల్లీకి చెందిన హరీష్ రాణా అనే యువకుడికి కారుణ్య మరణం (Euthanasia) అనుమతిస్తూ లైఫ్ సపోర్ట్ చికిత్సను నిలిపివేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. హరీష్ రాణా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం మానవీయ కోణాన్ని పరిగణలోకి తీసుకుని తీర్పు ఇచ్చింది.
వివరాల ప్రకారం, 2013 ఆగస్టు 20న చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో హరీష్ రాణా ప్రమాదానికి గురయ్యాడు. అతను నివసిస్తున్న పీజీ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆ ఘటన తర్వాత అతడు పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయి శరీరం కదలలేని పరిస్థితికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతడిని చికిత్స కోసం దేశంలోని పలు ప్రముఖ ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. అప్పటి నుంచి 13 ఏళ్లుగా వారు తమ కుమారుడిని కంటికి రెప్పలా చూసుకుంటూ జీవిస్తున్నారు.
ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన హరీష్ తల్లిదండ్రులు తమ కుమారుడికి ఈ నరక జీవితం నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ మొదటిసారి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. తర్వాత మెడికల్ బోర్డు నివేదికల్లో హరీష్ కోలుకునే అవకాశం లేదని స్పష్టంగా పేర్కొనడంతో వారు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం హరీష్ తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంది. వైద్య నివేదికలను పరిశీలించిన అనంతరం అతడిలో ఎలాంటి మెరుగుదల కనిపించే అవకాశాలు లేవని కోర్టు పేర్కొంది. రోగిని కాపాడటమే వైద్యుల విధి అయినప్పటికీ, కోలుకునే అవకాశం లేనప్పుడు లైఫ్ సపోర్ట్ కొనసాగించడం ప్రయోజనం ఉండదని అభిప్రాయపడింది. అతడి గౌరవానికి భంగం కలగకుండా లైఫ్ సపోర్ట్ చికిత్సను నిలిపివేసే బాధ్యత ఎయిమ్స్ వైద్యులపై ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు భారతదేశంలో కారుణ్య మరణంపై జరుగుతున్న చర్చలకు కొత్త దిశను ఇచ్చింది. ఇప్పటికే 2011లో అరుణ షాన్‌బాగ్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చే మార్గాన్ని సూచించిన విషయం తెలిసిందే. తాజాగా హరీష్ రాణా కేసులో ఇచ్చిన ఈ తీర్పు దేశ న్యాయ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS