సెక్యులర్ అంటే మోదీకి భయం: రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలతో నడవండి – ఖర్గే హైదరాబాద్, జూలై 7 – “సెక్యులరిజం అంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమేస్తోంద
సెక్యులర్ అంటే మోదీకి భయం: రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలతో నడవండి – ఖర్గే
హైదరాబాద్, జూలై 7 – “సెక్యులరిజం అంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమేస్తోంది. రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. రాజ్యాంగం జోలికొస్తే ఊరుకునేది లేదు,” అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన “సామాజిక న్యాయ సమరభేరి” సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఖర్గే, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, “మోదీకి దేశ భద్రత కన్నా ఎన్నికలే ముఖ్యమైపోయాయి. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే వెళ్లే తీరికలేదు. విదేశాంగ విధానంలో విఫలమయ్యారు. మిత్ర దేశాలన్నీ శత్రువులుగా మారుతున్నాయి,” అన్నారు.
కాంగ్రెస్ ఆందోళన – రాజ్యాంగంపై కుట్రలు
ఖర్గే మాట్లాడుతూ, “బీజేపీ సొంత రాజ్యాంగంలో సెక్యులరిజం పదం పెట్టుకొని, దేశ రాజ్యాంగం నుంచి దానిని తొలగించాలనుకుంటోంది. ఇది ప్రజాస్వామ్యానికి తలకిందులైన దెబ్బ. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదంతో ప్రజల మధ్యకు వెళ్తున్నాం,” అని తెలిపారు.
మన్‌కీ బాత్ కాదు, కామ్‌కీ బాత్ కావాలి
“మోదీ మాట్లాడుతారు కానీ పని చేయరు. మన్‌కీ బాత్‌లు వినిపిస్తాయి కానీ కామ్‌కీ బాత్ లేదు. 2 కోట్ల ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధరలు అన్నీ వాగ్దానాలే. హైదరాబాద్‌లో కాంగ్రెస్ 50 కేంద్ర సంస్థలు తీసుకొచ్చింది. బీజేపీ ఏం ఇచ్చింది?” అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ ఆదర్శంగా నిలిచింది
“తెలంగాణ బీసీ కులగణనలో దేశానికి ఆదర్శంగా మారింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయ పరిరక్షణకు కట్టుబడి ఉంది. ఉచిత బస్సులు, విద్యుత్, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు 4.5 లక్షల గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం, యువతకు రోహిత్ వేముల పేరుతో మద్దతు చట్టం తీసుకొస్తాం,” అన్నారు ఖర్గే.
సభ విజయవంతం – కాంగ్రెస్‌కి కొత్త ఉత్సాహం
ఎల్బీ స్టేడియంలో వేలాది మంది ప్రజలు, కార్యకర్తలతో సభ కిక్కిరిసిపోయింది. ఇది కాంగ్రెస్ నాయకత్వానికి కొత్త ఊపునిస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై దీని ప్రభావం చూపనుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
“మోదీకి దేశ భద్రత కాదు, ఎన్నికలే ముఖ్యం”
ఖర్గే మరోసారి ప్రధాని మోదీపై మండిపడ్డారు. “పాకిస్తాన్‌పై యుద్ధాన్ని మధ్యలోనే ఎందుకు ఆపారు? ట్రంప్ అన్నట్లు ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపాడని అంటే… మోదీ ఎందుకు స్పందించలేదు? ఇదేనా దేశభక్తి?” అని నిలదీశారు.
ఖర్గే పిలుపు:
“ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించేందుకు అందరూ కాంగ్రెస్‌తో కలిసి నడవాలి. లేదంటే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది,” అని తీవ్ర హెచ్చరికలు చేశారు.
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS