బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్‌కు షాక్ తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ ష
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్‌కు షాక్
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను విచారించేందుకు నిరాకరిస్తూ గురువారం డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత, ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే అభిప్రాయం తప్పని, ఇందిరా సహానీ కేసులో కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పరిమితి దాటవచ్చని కోర్టుకు వివరించారు.
దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందని, ప్రతి ఇంటి స్థాయిలో వివరాలు సేకరించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలు రిజర్వేషన్ల పెంపుపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని, మూడు నెలలు దాటినా గవర్నర్ బిల్లుపై నిర్ణయం తీసుకోలేదని వాదించారు. సుప్రీంకోర్టు గత తీర్పు ప్రకారం, గవర్నర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు చట్టంగా మారినట్టేనని సింఘ్వీ స్పష్టం చేశారు.
అయితే, జస్టిస్ విక్రమ్‌నాథ్ మరియు జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈ వాదనలను పరిశీలించిన తర్వాత పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున సుప్రీంకోర్టు దానిపై విచారణ చేపట్టలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలను నిర్వహించవచ్చని సూచించింది.
ఈ తీర్పుతో రేవంత్ సర్కార్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సిద్ధమవుతుండగా, బీసీ రిజర్వేషన్ల సమస్య మరింత క్లిష్టంగా మారింది. కాసేపట్లో జరగనున్న కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

COMMENTS