జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట ముమ్మరం; సరిహద్దుల్లో పాక్ కాల్పుల ఉద్రిక్తత శ్రీనగర్/జమ్మూ: ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట ముమ్మరం; సరిహద్దుల్లో పాక్ కాల్పుల ఉద్రిక్తత
శ్రీనగర్/జమ్మూ: ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, పోలీసులు ఉగ్రవాదులు, వారి అనుచరుల కోసం వేటను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో వందకు పైగా అనుమానితుల నివాసాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్న వారిని గుర్తించడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సోదాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ అనంతరం సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలు పెరిగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ముఖ్యంగా కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్, పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్‌కు పాల్పడుతున్నారు. భారత జవాన్లు ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు.
పాక్ కాల్పుల్లో నివాస ప్రాంతాలే లక్ష్యం కావడంతో సరిహద్దు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ అనే భారత జవాను అమరుడయ్యారు. గత 14 రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని, ఈ కాల్పుల్లో 13 మంది భారత పౌరులు మరణించగా, 57 మంది గాయపడ్డారని సైన్యం తెలిపింది.

COMMENTS