అమర జవాన్ మురళీ నాయక్‌కు కన్నీటి వీడ్కోలు: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు, మంత్రుల నివాళి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన అమర జవా
అమర జవాన్ మురళీ నాయక్‌కు కన్నీటి వీడ్కోలు: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు, మంత్రుల నివాళి
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన అమర జవాన్ మురళీ నాయక్‌కు సోమవారం (మే 12) స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఆయన వీరమరణం పొందారు.
మురళీ నాయక్ భౌతికకాయానికి వేలాది మంది ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అశ్రునయనాల మధ్య తుది నివాళులర్పించారు. ‘జై జవాన్’, ‘భారత మాతాకీ జై’ నినాదాలతో అంతిమ వీడ్కోలు పలికారు.
మంత్రుల పరామర్శ, నివాళి:
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, మంత్రులు వంగలపూటి అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, అనగాని సత్య ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు మురళీ నాయక్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. మంత్రి నారా లోకేశ్ స్వయంగా మురళీ నాయక్ పాడెను మోసి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ రుణం తీరనిదని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
జవాన్ తండ్రి హృదయ విదారక మాటలు:
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. ఈ సమయంలో మురళీ నాయక్ తండ్రి రాంనాయక్… “మురళీ… నీ హీరో పవన్ సార్ వచ్చారు. లేచి ఒకసారి సెల్యూట్ చేయరా” అని కన్నీళ్లతో పలికిన మాటలు అక్కడున్న వారందరినీ తీవ్రంగా కలిచివేశాయి. మురళీ నాయక్‌కు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని, తరచూ ఆయన పాటలకు డ్యాన్స్ చేస్తుండే వాడని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు.
ప్రభుత్వం, పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం:
అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. రూ. 50 లక్షల పరిహారంతో పాటు, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం, మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నిధుల నుంచి మరో రూ. 25 లక్షల ఆర్థిక సాయాన్ని జవాన్ కుటుంబానికి ప్రకటించారు.
వేలాదిగా తరలివచ్చిన ప్రజలు:
శనివారం బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న మురళీ నాయక్ భౌతికకాయాన్ని అక్కడి నుంచి సత్యసాయి జిల్లాలోని స్వగ్రామానికి ప్రత్యేక వాహనంలో తరలించారు. ఏపీ సరిహద్దు నుంచి వందల వాహనాలతో భారీ ర్యాలీగా, వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆర్మీ వాహనం వెంబడి తరలివచ్చారు. అడుగడుగునా నివాళులర్పిస్తూ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. కోట్లు సంపాదించినా దక్కని వీరమరణం ఇదని, వేలాది మంది తరలివచ్చి నివాళులర్పించడం వైరల్ అవుతోందని పేర్కొన్నారు.

COMMENTS