ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ – అదనంగా ఆర్థిక లాభం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక మార్పులు చేసింది. ల
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ – అదనంగా ఆర్థిక లాభం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక మార్పులు చేసింది. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం నాలుగు విడతల్లో అందించడమే కాకుండా, ఇప్పుడు ఈ పథకాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసింది.
దీని ద్వారా జాబ్‌కార్డు కలిగిన లబ్ధిదారులకు రోజుకు రూ.307 చొప్పున గరిష్ఠంగా 90 రోజుల పనిని కల్పిస్తారు. ఈ విధంగా మరో రూ.27,630 అదనంగా వారి ఖాతాల్లో జమ అవుతుంది. అలాగే స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మించుకుంటే మరో రూ.12 వేల ఆర్థిక సహాయం కూడా అందుతుంది.
ఉపాధి హామీ కింద కల్పించే 90 పనిదినాలను ఇంటి నిర్మాణ దశల వారీగా విభజించారు – బేస్‌మెంట్ వరకు 40 రోజులు, లెంటల్ వరకు 30 రోజులు, నిర్మాణం పూర్తయ్యాక 20 రోజులు. ఒక ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తికాకపోతే, మిగిలిన పనిదినాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొనసాగించేందుకు వీలు కల్పించారు.
వేతనాల చెల్లింపుల కోసం నిర్మాణ దశలలో లబ్ధిదారుడి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. నిర్మాణం పూర్తయ్యాక పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించగానే డబ్బులు జమ అవుతాయి. అయితే ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం మినహా ఇతర ఉపాధి హామీ పనులు ఇవ్వరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ చర్యలతో ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తవడంతో పాటు, పేద కుటుంబాలకు అదనపు ఆర్థిక భరోసా లభించనుంది.

COMMENTS