భారత్ ఆపరేషన్ సిందూర్ దాడిలో 11 మంది సైనికులు, 40 మంది పౌరుల మృతి: పాక్ ఆర్మీ ప్రకటన ఇస్లామాబాద్, మే 14: భారత దేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దాడి
భారత్ ఆపరేషన్ సిందూర్ దాడిలో 11 మంది సైనికులు, 40 మంది పౌరుల మృతి: పాక్ ఆర్మీ ప్రకటన
ఇస్లామాబాద్, మే 14:
భారత దేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దాడిలో పాక్‌కు భారీ నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ మిలటరీ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ సహా 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. అంతేకాక, దాడిలో 40 మంది పౌరులు మృతిచెందినట్లు, 121 మంది పౌరులు గాయపడ్డట్లు తెలిపింది.
ఈ దాడిలో మొత్తం 78 మంది సైనికులు గాయాలపాలయ్యారు. మృతుల్లో చీఫ్ టెక్నీషియన్ ఔరంగ్‌జేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్ ఉన్నారు. గాయపడినవారిలో చాలామంది రావల్పిండిలోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ సోమవారం స్వయంగా పరామర్శించారు.
ఇక పాక్ విదేశాంగ శాఖ మంగళవారం స్పందిస్తూ, “కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడి ఉంది” అని ప్రకటించింది. అయితే ఆపరేషన్ సిందూర్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకించింది.
మోదీ వ్యాఖ్యలపై స్పందించిన పాక్, “కాల్పుల విరమణ కోరుతూ భారత్ వద్దకు పాకిస్థాన్ పరుగెత్తుకెళ్లింది అనేది పచ్చి అబద్ధం” అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్ వ్యవహారశైలి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా ఉందని విదేశాంగ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది.

COMMENTS