కోనసీమలో భారీ అగ్నిప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఏడుగురు మృతి..! డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది
కోనసీమలో భారీ అగ్నిప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఏడుగురు మృతి..!
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదం తీవ్రతతో ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు తెలిపిన ప్రకారం, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రమాదంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి కూడా మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఎమ్మెల్యే స్పందన:
ప్రమాద సమాచారం అందిన వెంటనే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ, తూర్పుగోదావరి-కోనసీమ జిల్లాల సరిహద్దులో ఈ ఘటన జరిగిందని చెప్పారు. 70 సంవత్సరాలుగా ఈ బాణసంచా ఫ్యాక్టరీ నడుస్తోందని, అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు ఇటీవల అధికారుల తనిఖీల్లో తేలిందన్నారు. అయినప్పటికీ ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమని తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా సంఘటనా స్థలానికి చేరుకోనున్నారని చెప్పారు.
COMMENTS