జగిత్యాలలో కాంగ్రెస్ పతనానికి ఎమ్మెల్యే సంజయ్ కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణలు. పార్టీకి స్వేచ్ఛ ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి.. Jagtial Pol
జగిత్యాలలో కాంగ్రెస్ పతనానికి ఎమ్మెల్యే సంజయ్ కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణలు. పార్టీకి స్వేచ్ఛ ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి..
Jagtial Politics: జగిత్యాల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత బహిరంగంగా బయటపడుతున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎమ్మెల్యే సంజయ్ కారణమని ఆరోపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కురు సామ్రాజ్య పతనానికి శకుని ఎలా కారణమయ్యాడో.. అలాగే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని అధోపాతాళానికి చేర్చింది సంజయ్ కుమారేనని సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 40 స్థానాలు గెలుస్తామని భావించిన కాంగ్రెస్ పార్టీ 20–22 స్థానాలకే పరిమితమైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్థానిక కార్యకర్తలకు స్వేచ్ఛ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని జీవన్ రెడ్డి వేడుకున్నారు.
జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకే చైర్మన్ పదవులు ఇవ్వాలని, అవకాశవాదులకు అవకాశాలు కల్పించొద్దని ఆయన సూచించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జోక్యంతో బీ ఫామ్ పంపిణీలో సమస్యలు ఏర్పడి, పార్టీ స్వతంత్రులపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. రాయికల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి ఒక్కటి మాత్రమే గెలిచారని, తాము మూడు స్థానాల్లో పోటీ చేసి రెండు గెలిచామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
టికెట్లు రాని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచి ప్రచారం చేయాల్సి వచ్చిందని, అధికారిక అభ్యర్థులకు ప్రచారం చేయలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఓడించడానికి ఎమ్మెల్యే సంజయ్ ప్రచారం చేశారని ఆరోపించారు. గెలిచిన అభ్యర్థులను తన వైపు తిప్పుకోవాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని కూడా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని, స్వతంత్రులకు అండగా నిలుస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పటికే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక సమయంలోనే జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్టీలో సీనియర్ నాయకుడిగా తనను సంప్రదించకుండా చేరికపై నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అప్పట్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించిన ఆయనను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించింది. అయినప్పటికీ జగిత్యాలలో పార్టీ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీశాయి.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS